revanth reddy: కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు: రేవంత్ రెడ్డి
- సొంత వ్యవహారాలను సరిపెట్టుకోవడంలో కేసీఆర్ బిజీగా ఉన్నారు
- సచివాలయం కోమాలోకి వెళ్లిపోయింది
- మహాకూటమి ఘన విజయం సాధించడం ఖాయం
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి మండిపడ్డారు.
నిరుద్యోగుల, రైతులు, విద్యార్థుల జీవితాలను కేసీఆర్ నాశనం చేశారని రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయమనేదే లేదని చెప్పారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలపై ఎన్ని దాడులు జరిగాయో చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. మన దేశంలో పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంటు వరకు సచివాలయ వ్యవస్థ ఉందని... కానీ, కేసీఆర్ ఏనాడూ సచివాలయానికి వెళ్లలేదని విమర్శించారు.
పాలనను కేసీఆర్ గాలికొదిలేశారని... ఫాంహౌస్ లో ఉండటం, సొంత వ్యవహారాలను సరిపెట్టుకోవడంలో కేసీఆర్ బిజీగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ రాకపోవడంతో మంత్రులు, సెక్రటరీలు కూడా సచివాలయానికి రాలేదని.. దీంతో, సచివాలయం కోమాలోకి వెళ్లిపోయిందని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని కేసీఆర్ పూర్తిగా కోల్పోయారని అన్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు.