voters list: ఓటరు జాబితాలో పేర్లు గల్లంతు... పోలింగ్ రోజు రెవెన్యూ కార్యాలయాల ముందు ఆందోళన
- చనిపోయిన వారి పేర్లుండి, బతికున్న వారి పేర్లు లేని జాబితా ఒకటి
- మరోచోట ఒకే గ్రామానికి చెందిన 1500 మంది ఓట్లు మాయం
- ఆయా ప్రాంతాల తహసీల్దార్‌లను నిలదీసిన బాధితులు
ఓటేసేందుకు వెళ్లే సమయంలో ఓటర్ల జాబితాలో పేరు లేదని తెలియడంతో పలుచోట్ల అర్హులు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం, కామారెడ్డి జిల్లా బిక్కనూర్, మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట బాధితులు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే...కామారెడ్డి జిల్లా పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన 1500 మంది ఓట్లు గల్లంతయ్యాయి.
ఒకే గ్రామానికి చెందిన ఇంతమంది పేర్లు జాబితాలో లేకపోవడం ఏమిటని గ్రామస్థులు బిక్కనూరు ఎమ్మార్వోను నిలదీశారు. అలాగే, ఆర్మూర్ పట్టణ పరిధిలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందిన ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లు ఉండడం, బతికున్న వారి పేర్లు లేకపోవడంతో స్థానికులు ఏకంగా రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
చెన్నూరు ఓటరు లిస్టులో తమ పేర్లు లేవంటూ రెవెన్యూ కార్యాలయం ముందు కొందరు బాధితులు నిరసన తెలియజేశారు. పోలింగ్ సమయంలో ఇలా వందలాది మందికి ఓట్లు లేవన్న విషయం బయటపడడంతో కలకలానికి కారణమైంది.