Kcr: వాతావరణం అనుకూలించకపోవడంతో.. ఓటు వేసేందుకు కారులో వెళ్లనున్న కేసీఆర్!
- దట్టంగా కురుస్తున్న మంచు
- చాపర్ టేకాఫ్ కు అనుమతి నిరాకరణ
- రోడ్డుమార్గాన చింతమడకకు కేసీఆర్
చింతమడకలో ఓటు వేసేందుకు ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లేందుకు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. వాతావరణం సరిగ్గా లేదని, మంచు ఎక్కువగా కురుస్తుందన్న కారణాలను చెప్పిన అధికారులు, చాపర్ టేకాఫ్ ప్రమాదకరమని చెప్పినట్టు సమాచారం. దీంతో వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గాన చింతమడకకు బయలుదేరి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకోగా, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కాగా, ఈ ఉదయం సిద్ధిపేటలో ఓటు వేసిన హరీశ్ రావు, ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య కేసీఆర్, తన కుటుంబ సభ్యులతో కలసి వచ్చి చింతమడకలో ఓటు వేయనున్నారని చెప్పారు. కాగా, ప్రస్తుతం కేసీఆర్ ఇంకా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లోనే ఉండి పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు.