Assembly: పొద్దున్నే ఓటేసి వచ్చేసిన రాజమౌళి, క్యూలో నిలబడివున్న అల్లు అర్జున్!

- ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు
- హైదరాబాద్ లో 20 బూతుల్లో ప్రారంభంకాని పోలింగ్
- ఓటు వేసిన హరీశ్ రావు, పోచారం, తుమ్మల తదితరులు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఎన్నికల కమిషన్ చెప్పినా, పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఉదయం 8 గంటలైనా కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. హైదరాబాద్ లోని సుమారు 20 పోలింగ్ బూతుల్లో ఈవీఎంలు మొరాయించినట్టు తెలుస్తోంది.
ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో, పొద్దున్నే ఓటేసి వచ్చి, ఆపై పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లాలని భావించిన ఎమ్మెల్యే అభ్యర్థులు పడిగాపులు కాస్తున్నారు. నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డి, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి, బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వర రావు, కరీంనగర్ లో ఎంపీ వినోద్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేటలో హరీశ్ రావు ఓటేశారు.
