Telangana: ఓటరు తీర్పు నేడే.. మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం!

  • ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ
  • సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
  • ఓటు హక్కును వినియోగించుకోనున్న 2,80,64,684 మంది ఓటర్లు

తెలంగాణలో కీలక ఘట్టానికి మరికాసేపట్లో తెరలేవబోతోంది. శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతోంది.  ఎన్నికల విధుల్లో ఉన్న 2 లక్షలమంది సిబ్బంది సర్వం సిద్ధంగా ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం 4 గంటలకే నిలిపివేయనున్నట్టు ఈసీ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఎన్నికల్లో తొలిసారి వీవీపాట్ యంత్రాలను వినియోగిస్తున్నారు. దీనివల్ల తన ఓటు ఎవరికీ పడిందీ తెలుసుకునే వీలు ఓటరుకు ఉంటుంది.

తెలంగాణలో మొత్తం 55,329 బ్యాలెట్ యూనిట్లు, 42,751 వీవీపాట్ యంత్రాలను వినియోగిస్తున్నారు. శేరిలింగంపల్లిలో అత్యధిక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, భద్రాచలం నియోజకవర్గంలో అత్యల్ప పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి బరిలో అత్యధికంగా 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బాన్సువాడలో అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 3,873 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 280 పోలింగ్ కేంద్రాలున్నాయి.

మొత్తం 119 నియోజకవర్గాల్లో 1821 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ 119 స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 99, టీడీపీ 13, టీజేఎస్ 8, సీపీఐ 3, ఎంఐఎం 8, బీజేపీ 118, బీఎస్పీ 107,  సీపీఎం 26, ఎన్‌సీపీ 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

25 నియోజకవర్గాల్లో 15 మంది లోపే పోటీ చేస్తుండగా, 76 నియోజకవర్గాల్లో 16 నుంచి 31 మంది పోటీ చేస్తున్నారు. 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో 32 కంటే ఎక్కువమంది బరిలో ఉన్నారు. మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,41,56,182 మంది కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,39,05,811.

  • Loading...

More Telugu News