Andhra Pradesh: ఓసారి చార్జింగ్ పెడితే 455 కిలోమీటర్లు దూసుకెళ్లవచ్చు.. సరికొత్త ‘కియా’ కార్లను ఆవిష్కరించిన చంద్రబాబు!
- ఏపీ ప్రభుత్వానికి 3 ఎలక్ట్రిక్ కార్లు అందజేసిన కియా
- జనవరిలో మార్కెట్ లోకి తొలి వాణిజ్య కారు
- 10 శాతం వాహనాలను విదేశాలకు పంపే ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ త్వరలోనే ఆటోమొబైల్ పరిశ్రమకు హబ్ గా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. కియా మోటార్స్ రాకతో అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోతాయని వ్యాఖ్యానించారు. అమరావతిలోని సచివాలయం వద్ద ఈ రోజు కియా ఎలక్ట్రిక్ కార్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
అనంతరం వీటిలో కొద్దిదూరం ప్రయాణించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కియా కారు చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. అనంతపురం ప్లాంటులో తొలికారు వచ్చే ఏడాది జనవరిలో బయటకు వస్తుందన్నారు. కియా కంపెనీ ఇక్కడ తయారుచేసే కార్లలో 90 శాతం దేశీయంగా అమ్ముతారనీ, మిగిలిన 10 శాతం కార్లను విదేశాలకు ఎగుమతి చేస్తారని వెల్లడించారు.
విద్యుత్ చవకగా మారేందుకు, సౌర విద్యుత్ ఒక్కో యూనిట్ రూ.1.50కే లభ్యమయ్యేలా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యర్థాల సేకరణకు త్వరలోనే 7,300 ఎలక్ట్రానిక్ వాహనాలను వినియోగిస్తామన్నారు. పర్యావరణహితమైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామన్నారు. ఏపీ సచివాలయంలో చంద్రబాబు ఎలక్ట్రానిక్ కార్లను, చార్జింగ్ స్టేషన్ ను ప్రారంభించిన సందర్భంగా నీరో హైబ్రిడ్, నీరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నీరో ఎలక్ట్రిక్ కార్లను ఏపీ ప్రభుత్వానికి బహుమతిగా అందజేసింది. ఈ వాహనాలను ఓసారి చార్జింగ్ చేస్తే ఏకధాటిగా 455 కిలోమీటర్లు దూసుకుపోతాయి.