Andhra Pradesh: పశ్చిమగోదావరిలో నారా లోకేశ్ కు ఝులక్.. ఖాళీ బిందెలతో మంత్రిని అడ్డుకున్న గ్రామస్తులు!
- ఆందోళనకు దిగిన 200 కుటుంబాలు
- తమకు తాగునీటి వసతి లేదని ఆవేదన
- ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి
పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ ఐటీ, పంచాయితీ రాజ్ మంత్రి నారా లోకేశ్ కు చేదు అనుభవం ఎదురయింది. నరసాపురం మండలంలోని తూర్పుతాళ్లు, బియ్యప్పు తిప్ప గ్రామాలకు చెందిన 200 కుటుంబాలు మంత్రి కాన్వాయ్ ను అడ్డుకున్నారు. స్థానికంగా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి కాన్వాయ్ కు ఖాళీ బిందెలు అడ్డుగా పెట్టి నిరసన తెలిపారు. తమ ప్రాంతానికి తాగునీటి వసతి కల్పించాలని అధికారులకు ఇప్పటికే చాలాసార్లు మొర పెట్టుకున్నామని స్థానికులు మీడియాకు తెలిపారు.
అయినా అధికారులు ఎలాంటి సౌకర్యం కల్పించలేదని వాపోయారు. అపరిశుభ్రమైన నీటిని తాగడం కారణంగా తామంతా అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల ఆందోళన నేపథ్యంలో కారు దిగి బయటకు వచ్చిన మంత్రి లోకేశ్ వారితో మాట్లాడారు. తాగునీటి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు తమ ఆందోళనను విరమించారు.