Telangana: అధికారికంగా మాత్రమే దుకాణాల బంద్... మద్యం ఏరులై ఎలా పారుతోందో తెలిస్తే షాక్!
- ముందుగానే చేరాల్సిన చోటికి చేరిపోయిన మద్యం నిల్వలు
- వైన్స్ షాపులతో అభ్యర్థుల ముందస్తు డీల్
- ఎక్సైజ్ శాఖ తనిఖీలు చేస్తున్నా నామమాత్రమే!
ఎన్నికల ప్రచారం ముగిసిన క్షణమే, అధికారికంగా మద్యం దుకాణాలన్నీ బందయ్యాయి. కానీ, మద్యం ఏరులై పారుతూనే ఉంది. గ్రేటర్ పరిధిలో నిత్యమూ జనాలతో నిండివుండే మద్యం దుకాణాలు మాత్రమే మూతబడి వెలవెలబోతున్నాయి. కానీ, ఇళ్లల్లో, గొలుసు దుకాణాల్లో భారీ స్థాయి నిల్వలు చేరాయి. కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాల్లో ఉండేంత స్టాక్ కూడా ఉందని తెలుస్తోంది. పలువురు అభ్యర్థులు ముందుగానే వైన్స్ షాపులతో ఒప్పందాలు కుదుర్చుకుని, వారి ద్వారానే గల్లీల్లోని ఇళ్లకు చేర్చి, అక్కడి నుంచి మద్యాన్ని సరఫరా చేయిస్తున్నారు.
పథకం ప్రకారం మందుబాబులకు మద్యం దొరుకుతుండగా, అక్కడే తాగి వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు జరిగిపోయాయి. కీలక కార్యకర్తలకు ఈ సరఫరా బాధ్యతలను అప్పగించగా, వారు ముందే మందుబాబులను గుర్తించి, వారికి చీటీలు ఇచ్చి, ఎక్కడికి వెళ్లి మద్యం తెచ్చుకోవాలో స్వయంగా సూచిస్తున్నారు. ఇక మరికొంతమందికి ముందే ఐదారు బాటిళ్లు ఇచ్చేసి, రెండు రోజులూ దాంతోనే సర్దుకోవాలని చెప్పారని తెలుస్తోంది.
తనిఖీలు జరుగుతాయన్న భయం ఉన్నప్పటికీ, పక్కా ప్రణాళికతో ఈ వ్యవహారం సాగుతోంది. చాలా మందికి బుధవారం మధ్యాహ్నమే మద్యం చేరిపోగా, నేడు తమకు కావాల్సిన వారి ఇళ్లకే రహస్యంగా సరఫరా జరుగుతోంది. గ్రేటర్ పరిధిలో మద్యం బల్క్ అమ్మకాలను ఎక్సైజ్ శాఖ నిషేధించగా, పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా మద్యం నిల్వలు వచ్చి చేరాయని అధికారులు అనుమానిస్తున్న పరిస్థితి. కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర నుంచి సీసాలు తెచ్చి, వాటిపై ఉండే సమాచారాన్ని తొలగించి మరీ మద్యాన్ని పంచడం గమనార్హం.
గత రెండు నెలల్లో అబ్కారీ శాఖ సరిహద్దుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం చాలా తక్కువేనని, అంతకు ఎన్నో రెట్లు రాష్ట్రంలోకి ప్రవేశించిందని భావిస్తున్న అధికారులు, మద్యం అమ్మకాలు, పంపిణీ జరుగుతున్నట్టు తెలిస్తే, టోల్ ఫ్రీ నంబరు 18004252523కు లేదా వాట్స్ యాప్ నంబర్ 7989111222కు తెలియజేయాలని అధికారులు కోరారు. ఫిర్యాదు వస్తే, నిమిషాల్లో దాడి చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.