Shivkumar: పార్టీ నుంచి నన్నే గెంటేస్తారా?.. వైఎస్ జగన్‌పై బహిష్కృత నేత ఫైర్

  • వైఎస్‌ను దుర్మార్గుడన్న కేసీఆర్
  • ఖండించి కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చిన శివకుమార్
  • బహిష్కరించిన జగన్

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓటు వేయాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చి బహిష్కరణకు గురైన వైసీపీ తెలంగాణ యూనిట్ జనరల్ సెక్రటరీ కొలిశెట్టి శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యవస్థాపకుడిని బహిష్కరించిన జగన్ పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణలో వైసీపీ తన పేరునే నమోదై ఉందని పేర్కొన్న ఆయన పార్టీ నుంచి తనను బహిష్కరించడం దారుణమన్నారు.

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇటీవల వనపర్తి సభలో మాట్లాడుతూ.. వైఎస్సార్ దుర్మార్గుడని అన్నారు. దీనిని తీవ్రంగా నిరసించిన వైసీపీ తెలంగాణ యూనిట్ జనరల్ సెక్రటరీ కొలిశెట్టి శివకుమార్ మాట్లాడుతూ..  కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ కోసం ఆయన ఎంతో చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలోని వైసీపీ అభిమానులు కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. శివకుమార్ ప్రకటనను తీవ్రంగా పరిగణించిన అధినేత జగన్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

బుధవారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడిన శివకుమార్.. పార్టీ వ్యవస్థాపకుడిని బహిష్కరించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను జీర్ణించుకోలేకే తాను కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చినట్టు వివరించారు. తెలంగాణలో వైసీపీని బతికించుకోవాలన్నదే తన తాపత్రయమని అయితే, జగన్ మాత్రం తనను శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరించారని వాపోయారు. ఓ పార్టీ వ్యవస్థాపకుడిని బహిష్కరించడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారని శివకుమార్ అన్నారు.

  • Loading...

More Telugu News