Telangana: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారానికి తెర
- బహిరంగ సభలపై నిషేధం
- సభలు, ఊరేగింపుల ద్వారా ప్రచారంపై ఈసీ ఆంక్షలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత బహిరంగ సభలపై ఈసీ నిషేధం విధించగా, సభలు, ఊరేగింపులు, సినిమా థియేటర్లు, టీవీల ద్వారా ప్రచారంపై ఆంక్షలు విధించింది.
కాగా, అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రజాకూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతలు గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో జాతీయ పార్టీల నేతలు సైతం పాల్గొన్నారు. తెలంగాణలోని మొత్తం 119 స్థానాలకు ఈ నెల 7న ఎన్నికలు జరగనున్నాయి. 11న కౌంటింగ్ జరుగుతుంది.
ఇదిలా ఉండగా, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ నెల 7వ తేదీనే జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగిసింది. ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ ఈ నెల 11వ తేదీనే ఓట్ల లెక్కింపు జరగనుంది.