Telangana: తెలంగాణలో కారుకు తిరుగులేదు.. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కాబోతున్నారు!: ఇండియాటుడే సర్వే
- మెజారిటీ ప్రజలు కేసీఆర్ కు మద్దతు ఇస్తున్నారు
- దక్షిణ తెలంగాణలో ప్రజాకూటమి సత్తా చాటబోతోంది
- టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా సర్వే నిర్వహణ
తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి విజయం సాధించబోతోందని పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఈ రోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అందుకు భిన్నంగా ఇండియాటుడే సర్వే విడుదల చేసింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ మరోసారి అధికారం నిలుపుకోబోతోందని ప్రకటించింది. అంతేకాదు, టీఆర్ఎస్ కు క్రమంగా ప్రజల మద్దతు పెరుగుతోందని వెల్లడించింది.
‘ఇండియా టుడే పొలిటికల్ ఎక్స్ఛేంజ్’ పేరిట తాము 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు నిర్వహించామని ఇండియాటుడే గ్రూప్ తెలిపింది. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 48 శాతం మంది ప్రజలు మద్దతు ఇస్తుండగా, ప్రజాకూటమి అధికారంలోకి రావాలని 38 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు వెల్లడించింది. గత నెలలో టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్న వారి సంఖ్య కేవలం 44 శాతం మాత్రమేననీ, తాజాగా అది 4 శాతం పెరిగిందని పేర్కొంది. అధికార, విపక్షాల మధ్య కేవలం 10 శాతం మాత్రమే ఓట్ల తేడా ఉంటుందని సర్వే స్పష్టం చేసింది.
ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయబోతుండగా, దక్షిణ తెలంగాణలో మాత్రం ప్రజాకూటమి సత్తా చాటబోతోందని ఇండియా టుడే పొలిటికల్ ఎక్స్ఛేంజ్ సర్వేలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కల్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్లు ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశాలని సర్వే అభిప్రాయపడింది. నగరంలోని మురికివాడల్లో ప్రభుత్వంపై సానుకూలత కనిపిస్తోందని పేర్కొంది. అలాగే మజ్లిస్(ఏఐఎంఐఎం) మద్దతు కూడా టీఆర్ఎస్ కు కలిసి రానుందని తెలిపింది. సర్వేలో భాగంగా పార్లమెంట్ నియోజక వర్గాల నుంచి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా 6,887 అభిప్రాయాలను సేకరించామని వెల్లడించింది.