Telangana: రేవంత్ రెడ్డి అరెస్ట్ ఎఫెక్ట్.. వికారాబాద్ ఎస్పీపై కొరడా ఝుళిపించిన ఈసీ!

  • డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
  • ఎన్నికల విధుల్లో పాల్గొనరాదని ఆదేశం
  • కొత్త ఎస్పీగా అవినాశ్ మహంతి నియామకం

తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని నిన్న తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి(ఈసీ) ఫిర్యాదు చేసింది. దీంతో రేవంత్ రెడ్డి విషయంలో అతిగా వ్యవహరించిన పోలీసులపై ఈసీ కొరడా ఝుళిపించింది. రేవంత్ అరెస్ట్ వ్యవహారంలో వికారాబాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) టి.అన్నపూర్ణపై బదిలీ వేటు వేసింది.

ఆమెను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధుల్లో పాల్గొనరాదని స్పష్టం చేసింది. అలాగే వికారాబాద్ కొత్త ఎస్పీగా అవినాశ్ మహంతీని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న అవినాశ్ మహంతి ఈరోజు లేదా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.

నిన్న తెల్లవారుజామున 3 గంటలకు రేవంత్ ను పోలీసులు ఆయన ఇంట్లో అరెస్ట్ చేశారు. కొడంగల్ లోని కోస్గీలో నిన్న టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను అడ్డుకుంటామని రేవంత్ ప్రకటించడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అయితే రేవంత్ ను ఎక్కడ ఉంచారో చెప్పకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైడ్రామా చోటుచేసుకుంది. చివరికి సాయంత్రం 4 గంటల సమయంలో రేవంత్ ను విడిచిపెట్టాలని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు.

  • Loading...

More Telugu News