vijay malya: రుణాలన్నీ ఇచ్చేస్తా.. డబ్బులు తీసుకోండి.. నన్ను మాత్రం వదిలిపెట్టండి!: విజయ్ మాల్యా
- రుణాలు ఎగవేసే వ్యక్తిని కాదు
- చెల్లిస్తానంటే ఎవరూ అంగీకరించడం లేదు
- ట్విట్టర్ లో స్పందించిన లిక్కర్ కింగ్
బ్యాంకులకు రూ.9,000 కోట్లు కుచ్చుటోపి పెట్టి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా మరోసారి స్పందించారు. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తాను రుణాలను ఎగవేసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు.
‘బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పారిపోయాననీ, నేను ఓ ఎగవేతదారుడినని మీడియా, రాజకీయ నాయకులు నా గురించి పదేపదే చెబుతున్నారు. వాళ్లు చెప్పినదంతా అబద్ధం. రుణాల చెల్లింపుల కోసం కర్ణాటక హైకోర్టు ముందు నేను రాజీ ప్రస్తావన తెచ్చాను. దాని గురించి ఎవ్వరూ ఎందుకు మాట్లాడటం లేదు’ అని మాల్యా ప్రశ్నించారు.
‘విమాన ఇంధన ధరలు ఎక్కువగా ఉండటంతో ఎయిర్ లైన్స్ సంస్థలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కూడా అలాంటి సమస్యల్లోనే చిక్కుకుంది. చాలా నష్టాలను చవిచూసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు కూడా సరిపోలేదు. కానీ నేను తీసుకున్న మొత్తాన్ని 100శాతం తిరిగి చెల్లిస్తానని చెబుతున్నా.
దయచేసి నగదును తీసుకోండి. మూడు దశాబ్దాల పాటు భారత్‌లోనే అతిపెద్ద మద్యం విక్రయ సంస్థగా మాది గుర్తింపు పొందింది. దేశ ఖజానాకు రూ. వేల కోట్లు పన్నుల రూపంలో చెల్లించాం. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ద్వారా కూడా రాష్ట్రాలకు చాలా మొత్తమే చెల్లించాం. బాగా నడిచిన ఎయిర్‌లైన్స్ నష్టాల్లో కూరుకుపోవడంతో సమస్యలు మొదలయ్యాయి’ అని మరో ట్వీట్ చేశారు.
2016లో మాల్యా దేశం విడిచి లండన్ వెళ్లిపోయారు. అయితే ఆయనపై మనీలాండరింగ్ కింద కేసు నమోదవడంతో గతేడాది లండన్ పోలీసులు మాల్యాను అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న మాల్యా.. భారత్‌లో తన ఆస్తులను విక్రయించి బకాయిలు చెల్లిస్తానని గతంలో పలుసార్లు చెప్పారు. అయితే దర్యాప్తు సంస్థలు అందుకు అంగీకరించలేదు. మాల్యాను భారత్‌కు అప్పగించే విషయమై అక్కడి వెస్ట్‌మినిస్టర్ కోర్టులో విచారణ జరుగుతోంది. త్వరలోనే ఈ కేసులో తీర్పు రానుంది.