kadiyam srihari: మహాకూటమిలో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి అభ్యర్థే: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎద్దేవా

  • కాంగ్రెస్‌ పార్టీలో అయితే జిల్లాకు ముగ్గురు ఉన్నారని వ్యంగ్యోక్తులు
  • సీఎం అభ్యర్థులమని చెప్పుకునేవారు సొంత నియోజకవర్గాల్లో గెలుపుకోసం పోరాడుతున్నారని వ్యాఖ్య
  • మహాకూటమి కారణంగా కాంగ్రెస్‌ మునిగిపోబోతోందని జోస్యం

అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తాలేక కాంగ్రెస్‌ పార్టీ మహాకూటమి పేరుతో ఇతర పార్టీలతో జతకలిసిందని, ఈ కూటమి కారణంగానే కాంగ్రెస్‌ పార్టీ రానున్న ఎన్నికల్లో మునిగిపోబోతోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జోస్యం చెప్పారు. ప్రస్తుతం మహాకూటమి తరపున పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరూ తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని భావిస్తున్నారని విమర్శించారు. విపక్ష కాంగ్రెస్‌ పార్టీలో అయితే జిల్లాకు ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో శ్రీహరి బుధవారం మీడియాతో మాట్లాడారు.

మహాకూటమి ఏర్పాటే కాంగ్రెస్‌ చేసిన పెద్ద తప్పిదమన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థులమని చెప్పుకుంటున్న వారంతా తమ సొంత నియోజకవర్గాల్లో గెలుపుకోసం పోరాడుతున్నారని చెప్పారు. అసలు గెలుస్తారో లేదో తెలియకుండా అప్పుడే సీఎం కుర్చీకోసం పోటీ పడుతున్నారంటే, అటువంటి వారు అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా వుంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. వీరు అధికారంలోకి వస్తే తెలంగాణలో ప్రాజెక్టులు ముందుకు సాగుతాయా? అని ప్రశ్నించారు.

ఏదైనా అంశంపై ఆంధ్ర, తెలంగాణ మధ్య వివాదం ఏర్పడితే చంద్రబాబు ఆంధ్రావైపే ఉంటారన్న విషయం ప్రజలు గ్రహించాలని కోరారు. తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్‌ అని, చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని విమర్శలు చేసిన టీజేఎస్‌ అధినేత కోదండరాం ఇప్పుడు అదే తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఓటేయాలని కోరడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో టీజేఎస్‌ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలిచే అవకాశం లేదని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News