Bulandshahr: నేడు నా తండ్రి.. రేపెవరి తండ్రో.. కన్నీరుమున్నీరైన సీఐ సుబోధ్ కుమారుడు!
- హిందూ-ముస్లింల గొడవల్లో నా తండ్రి మరణించాడు
- హింసకు పూర్తి వ్యతిరేకమైన ఆయన హింసకే బలయ్యారు
- కంటతడి పెట్టించిన సుబోధ్ ఆవేదన
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గోరక్షకులు జరిపిన హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ కుమారుడు అభిషేక్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అందరి గుండెలను కదిలిస్తున్నాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసి అప్పుడే ఇంటికొచ్చిన అభిషేక్ తండ్రి మరణించిన వార్త తెలియగానే కుప్పకూలిపోయాడు.
హింసను వ్యతిరేకించే తన తండ్రి హింసకే బలయ్యారంటూ కన్నీరు పెట్టుకున్నాడు. నేడు తన తండ్రి చనిపోయాడని, రేపెవరి తండ్రి ప్రాణాలు కోల్పోతారోనని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన ఎప్పుడూ తనకు మంచే చెబుతుండేవారని, మతం పేరుతో సమాజాన్ని విడగొట్టడాన్ని ఆయన వ్యతిరేకించేవారని గుర్తుచేసుకున్నాడు. హిందూ-ముస్లిం గొడవల్లో నేడు తన తండ్రి మృతి చెందారని, రేపు ఎవరి తండ్రి ప్రాణాలు పోగొట్టుకోబోతున్నాడో అంటూ విలపించాడు. అభిషేక్ కంట తడి అందరినీ కలచివేసింది.
గోవధ జరిగిందన్న కారణంతో రెచ్చిపోయిన హిందూ గ్రూపులు, గో రక్షక దళాలు ఆందోళనకు దిగాయి. బులంద్‌షహర్‌ను రణరంగంగా మార్చేశారు. వీరిని అదుపు చేసేందుకు సిబ్బందితో కలిసి వెళ్లిన సీఐ సుబోధ్ కుమార్‌పై ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆయనపై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన సుబోధ్ ఆసుపత్రిలో మృతి చెందారు.