BJP: కర్ణాటకలో బీజేపీ కుట్రలకు తెరలేపింది.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్ల ఆశ చూపిస్తున్నారు!: మంత్రి శివకుమార్ ఆరోపణ
- మా ప్రభుత్వాన్ని కూల్చడానికి యత్నిస్తున్నారు
- గాలి, శ్రీరాములు ఇందుకు సహకరిస్తున్నారు
- బీజేపీ ప్రయత్నాలు ఎన్నటికీ నెరవేరవు
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి డి.కె.శివకుమార్ ఆరోపించారు. ఇందుకు మాజీ మంత్రులు గాలి జనార్దనరెడ్డి, శ్రీరాములు ప్రోద్బలంతో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని విమర్శించారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్ల మేర ఆశ చూపుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నేతలు రూ.100 కోట్లు ఇచ్చినా వారి ప్రయత్నాలు నెవవేరబోవని స్పష్టం చేశారు.
222 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి 2018, మే 12న ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. దీంతో బీజేపీ 104 స్థానాలు దక్కించుకోగా, కాంగ్రెస్ 80, జేడీఎస్ 37 స్థానాలు దక్కించుకున్నాయి. అయితే బీజేపీని అధికార పీఠానికి దూరంగా ఉంచాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ నాయకుడు కుమారస్వామికి సీఎం పదవిని ఇచ్చేందుకు అంగీకరించింది.