election commission: ఓటేసేందుకు ఓటరు కార్డుతోనే పనిలేదు... ఈ గుర్తింపు కార్డుల్లో ఏదున్నా చాలు!
- ప్రత్యామ్నాయంగా పన్నెండు రకాల కార్డులను సూచించిన ఈసీ
- వీటిలో ఏది చూపినా సరిపోతుంది
- గుర్తింపు కార్డుపై తప్పనిసరిగా ఫొటో ఉండాలి
ఎన్నికల వేళ ఓటరు గుర్తింపు కార్డు ప్రాధాన్యం తెలిసిందే. ఓటరు జాబితాలో నమోదైన వారికి ఈసీ ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేసింది. పోలింగు రోజున ఈ గుర్తింపు కార్డు చూపితేనే పోలింగ్ బూత్‌లోకి అనుమతిస్తారు. ఇది సాధారణ నియమం. అయితే ఏదైనా కారణం వల్ల ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా, వేరే ఎక్కడైనా మర్చిపోయినా ప్రత్యామ్నాయంగా మరో పన్నెండు రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపినా చాలని, ఓటేసేందుకు అనుమతిస్తారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు వారి ఉద్యోగ గుర్తింపు కార్డులు చూపితే చాలు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కూడా తమ అధికారిక గుర్తింపు కార్డు, ఆధార్‌ను చూపిస్తే సరిపోతుంది. ఇక సాధారణ వ్యక్తులు పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతా పుస్తకాలు, పాస్‌పోర్టు, కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం మంజూరు చేసిన స్మార్ట్ కార్డు, ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు, కార్మిక శాఖ ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, పెన్షన్ పత్రం, ఓటరు స్లిప్పులలో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. గుర్తింపు కార్డుపై తప్పనిసరిగా ఫొటో ఉండాలి