Lagadapati Rajgopal: లగడపాటి సర్వే తప్పు.. ఇదిగో ఆయన నాకు పంపిన మెసేజ్!: కేటీఆర్
- లగడపాటి సర్వేపై చంద్రబాబు ఒత్తిడి
- కుట్రను బయటపెట్టేందుకే చాటింగ్ బహిర్గతం
- టీఆర్ఎస్ విజయం ఖాయం
లగడపాటి రాజగోపాల్ మంగళవారం ప్రకటించిన సర్వే వివరాలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. విజయం ఖాయమని ధీమాగా ఉన్న టీఆర్ఎస్‌కు ఈ సర్వే వివరాలు మింగుడుపడడం లేదు. మరోవైపు, ప్రజాకూటమి అభ్యర్థుల్లో ఈ సర్వే ఫుల్ జోష్ నింపింది. లగడపాటిది చిలుక జోస్యమని ట్విట్టర్‌లో ఎద్దేవా చేసిన టీఆర్ఎస్ నేత కేటీఆర్ తాజాగా, మరో ట్వీట్ చేశారు. లగడపాటి వెల్లడించిన వివరాలు వాస్తవం కాదని, నిజమేంటో తనకు తెలుసని పేర్కొన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు.
టీఆర్ఎస్ విజయం సాధిస్తుందంటూ స్వయంగా లగడపాటి తనకు మెసేజ్ చేశారని పేర్కొన్న కేటీఆర్ ఆ మెసేజ్‌ను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మంగళవారం ఆయన వెల్లడించిన సర్వే వివరాలు పూర్తిగా కుట్ర పూరితంగా ఉండడం వల్లే వాటిని ఖండించాల్సి వచ్చిందన్నారు. గత నెల 20న రాజగోపాల్ తనకు ఓ మెసేజ్ చేశారని, అందులో టీఆర్ఎస్‌కు 65-70 సీట్లు వస్తాయని పేర్కొన్నారని కేటీఆర్ తెలిపారు.
చంద్రబాబు నాయుడు ఒత్తిడితో రాజగోపాల్ తన సర్వేను తారుమారు చేశారని, అంకెలు మార్చారని ఆరోపించారు. ఈ కుట్రను బయటపెట్టేందుకే రాజ్‌గోపాల్‌తో జరిగిన చాటింగ్‌ను బయటపెట్టినట్టు పేర్కొన్నారు. కేటీఆర్ బయటపెట్టిన వివరాల ప్రకారం.. టీఆర్ఎస్ 65 నుంచి 70 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉండగా, ప్రజాకూటమికి 35 నుంచి 40 స్థానాలు వస్తాయి. బీజేపీ 2-3 స్థానాల్లో, ఎంఐఎం 6-7, ఇతరులు 1-2 స్థానాల్లో విజయం సాధిస్తారు.