Chandrababu: నేటితో తెలంగాణలో ప్రచారం బంద్.. చివరి రోజున ప్రముఖుల సుడిగాలి పర్యటన
- నేటి సాయంత్రంతో మూగబోనున్న మైకులు
- చివరి రోజున నేతలు ఫుల్ బిజీ
- రంగంలోకి కేసీఆర్, చంద్రబాబు, రాహుల్, యోగి
తెలంగాణలో నేటితో మైకులు మూగబోనున్నాయి. సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఏడో తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం నేటి సాయంత్రం ఐదు గంటలతో పార్టీలన్నీ తమ ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది.
చివరి రోజైన నేడు వివిధ పార్టీల ముఖ్య నేతలు పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ఏపీ సీఎం చంద్రబాబు, రాహుల్ జంటగా ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే, కోదాడలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ముథోల్ బీజేపీ అభ్యర్థి రమాదేవికి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు.