kcr: కేసీఆర్ కు ‘ముందస్తు’గా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయి: రేవంత్ రెడ్డి
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్ లు కలిసొస్తే చూసుకుందాం
- ముగ్గురూ కలిసొస్తే, కొడంగల్ చౌరస్తాలో తేల్చుకుందాం
- కేసీఆర్ పెద్దమొనగాడినని అనుకుంటున్నారు
ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా కేసీఆర్ కు ముందస్తుగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. కొడంగల్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముందు కేటీఆర్, ఆ తర్వాత కేసీఆర్ వచ్చినా తననేమీ చేయలేకపోయారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు వీళ్లు ఒక్కొక్కరు కాదు, ముగ్గురూ కలిసి రావాలని, కొడంగల్ చౌరస్తాలో తేల్చుకుందామని సవాల్ విసిరారు. కేసీఆర్ తన ముఠాలను, మూటలను తీసుకొని వస్తే ఇక్కడి చౌరస్తాలో గిరి గీసుకుని చూసుకుందామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘పోలీసుల రక్షణలో, పహారాలో పర్యటిస్తున్న కేసీఆర్ పెద్ద మొనగాడని అనుకుంటున్నాడేమో.. నీకు చెబుతున్నా బిడ్డా! నీ అనుచరులు, పట్నం సోదరులు మీ వ్యవహారం చూస్తుంటే చార్లెస్ శోభరాజ్ కు బిల్లా రంగాలు మద్దతు పలికినట్టుగా ఉంది’ అని రేవంత్ విమర్శించారు.