Andhra Pradesh: చంద్రబాబుతో రాజకీయ వైరం వ్యక్తిగతంగా మారిందా? అన్న ప్రశ్నకు స్పందించిన కేసీఆర్!
- చంద్రబాబు ప్రతీ ప్రాజెక్టును అడ్డుకున్నారు
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించారు
- ఏపీలో రాజకీయాల్లో జోక్యం చేసుకుంటా
తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన ప్రతీ ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపుల్ల వేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టులపై కోర్టుల్లో కేసులు వేయడంతో పాటు నిర్మాణానికి వ్యతిరేకంగా కేంద్ర జలసంఘానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి మహాకూటమి (ప్రజాకూటమి) పేరుతో తెలంగాణలోకి అడుగుపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. టీడీపీకి తెలంగాణలో ఎలాంటి బలం లేదనీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ దక్కించుకున్న ఒక్క స్థానమే అందుకు నిదర్శమని వ్యాఖ్యానించారు. ఇండియాటుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ ఈ మేరకు స్పందించారు.
చంద్రబాబు నాయుడు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. జార్ఖండ్ కు లాలూ ప్రసాద్ యాదవ్ ఎలాగో, తెలంగాణకు కూడా చంద్రబాబు అలాగే బయటి వ్యక్తి అని తేల్చిచెప్పారు. ‘తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మెజారిటీ లేకపోయినా మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు యత్నించారు. ఇలాంటప్పుడు నేను నోరు మూసుకుని కూర్చోవాలా? చంద్రబాబుతో నాకు వ్యక్తిగత వైరం ఏమీ లేదు’ అని తెలిపారు.
తెలంగాణ ప్రజలు తనకు ఓ బాధ్యతను అప్పగించారని, దానిని నెరవేరుస్తున్నానని చెప్పారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా జోక్యం చేసుకుని చంద్రబాబు చాలా పెద్ద తప్పు చేశారన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో వేలుపెడతాననీ, కేసీఆర్ అంటే ఏమిటో చూపిస్తానని సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 95-107 స్థానాలతో అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.