Balakrishna: తెలుగువాళ్లకు ఐటీ గురించి తెలియని రోజుల్లో చంద్రబాబు దానికి నిర్వచనం ఇచ్చారు!: బాలకృష్ణ
- చంద్రబాబు కట్టిన భవనాల్లో కేసీఆర్ ఉంటున్నారు
- ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నారు
- ఓల్డ్ బోయిన్ పల్లి రోడ్ షోలో బాలయ్య
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) గురించి తెలియని రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీకి నిర్వచనం ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. చంద్రబాబు హయాంలో కట్టిన భవనాల్లో కూర్చుని ఇప్పుడు సీఎం కేసీఆర్ బాబునే విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వం గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు కళ్ల ముందు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. టీడీపీకి తెలంగాణలో త్వరలోనే పూర్వవైభవం వస్తుందని జోస్యం చెప్పారు. ఓల్డ్ బోయిన్ పల్లిలో ఈ రోజు మహాకూటమి తరఫున నిర్వహించిన రోడ్ షో లో బాలకృష్ణ పాల్గొన్నారు.
తెలుగుదేశం ఓ కులానికీ లేదా ఓ మతానికి పుట్టిన పార్టీ కాదని బాలయ్య వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నడిబొడ్డున ప్రజా మద్దతుతో టీడీపీ పుట్టిందని తెలిపారు. తెలుగువారికి కష్టం వస్తే బెంగళూరు, ఉత్తరాఖండ్ వరకూ వెళ్లి పోరాడామనీ, తెలుగు ప్రజలను ఆదుకున్నామని బాలయ్య గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని సూచించారు. ‘సమయం లేదు మిత్రమా.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోండి’ అంటూ బాలయ్య తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సారి తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.