Telangana: అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. ప్రియుడిని గొంతునులిమి హతమార్చిన భర్త!

  • తెలంగాణలోని రాచకొండలో ఘటన
  • దృశ్యం సినిమా తరహాలో పోలీసులకు బురిడీ
  • కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు

భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని ఓ భర్త తట్టుకోలేకపోయాడు. భార్యపై ఉన్న ప్రేమతో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని బంధువు సాయంతో కిరాతకంగా హతమార్చాడు. అతని చావుపై ‘దృశ్యం’ సినిమా తరహాలో కట్టుకథ అల్లాడు. అయితే పోలీస్ అధికారులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాన్ని బయటపెట్టాడు. తెలంగాణలోని రాచకొండ పరిధి గత నెల 28న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రకాశం జిల్లాకు చెందిన మల్తినేని నాగేశ్వరరావు రాచకొండ ప్రాంతంలోని బీఎన్‌రెడ్డి నగర్‌లో మాతృశ్రీ గౌరీశంకర్‌ మిల్క్‌పాయింట్‌ నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో ఉంటున్న ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ప్రసాదరావు అక్కడే పాలు కొనుగోలు చేసేవాడు. ఈ క్రమంలో ప్రసాదరావుకు షాపు యజమాని భార్యతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీన్ని గమనించిన నాగేశ్వరరావు ప్రవర్తన మార్చుకోవాలని భార్యకు సూచించాడు. అయితే పరిస్థితి ఏమాత్రం మారకపోవడంతో ప్రసాదరావును చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇందుకోసం తన బంధువైన నాగులపాటి వెంకటేశ్వరరావును అక్కడకు రప్పించాడు. ఈ క్రమంలో గత నెల 27న సాయంత్రం ప్రసాదరావు షాపు వద్దకు వచ్చి కూర్చుని కబుర్లు చెబుతున్నాడు. ఇంతలో మద్యం తాగుదామని వెంకటేశ్వరరావు బీర్లను తెచ్చాడు. అయితే తాను మందు తాగనని ప్రసాదరావు చెప్పాడు. ఈ సందర్భంగా పూటుగా మద్యం సేవించిన నాగేశ్వరరావు ప్రసాదరావుతో గొడవపడి అతని గొంతు నులిమి హత్యచేశాడు.

అనంతరం బంధువుతో కలిసి ఆ మృతదేహాన్ని మరో చోట పడేశారు. తమపై అనుమానం రాకుండా బంగారు గొలుసు, ఉంగరం, పర్సును మరోచోట దాచేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులకు తొలుత ఎలాంటి సాక్ష్యం లభించలేదు. దుండగులిద్దరూ పోలీసులకు  ‘దృశ్యం’ సినిమాలో వెంకటేశ్ ఫ్యామిలీలా ఒకే జవాబు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని విడివిడిగా విచారించడంతో ఒకరేమో ప్రసాదరావు సాయంత్రం 6 గంటలకే తమ షాపు నుంచి వెళ్లిపోయాడని చెప్పగా, మరొకరు 8.30 గంటల వరకూ ఉన్నాడని సమాధానమిచ్చారు.

దీంతో పోలీసులు తమదైన శైలిలో మరోసారి ప్రశ్నించడంతో తామే ఈ హత్య చేశామని అంగీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితులను కోర్టు ముందు హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు.

Telangana
affair
extra martial
killed
Police
arrest
illicit affair
  • Loading...

More Telugu News