Telangana: అప్పట్లో కాంగ్రెస్ కు ప్రచారం చేశానని చంద్రబాబు నన్ను చావగొట్టించారు.. తలపై 19 కుట్లు పడ్డాయి!: అసదుద్దీన్ ఒవైసీ
- 1999 ఎన్నికల్లో గుంటూరులో ప్రచారం చేశా
- టాస్క్ ఫోర్స్ మా పిల్లలను హింసించింది
- అడ్డుకోవడానికి వెళితే నన్నూ చావగొట్టారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1999 ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులతో తనపై దాడి చేయించారని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.1999 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా తాను గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించానని అసద్ గుర్తుచేసుకున్నారు. అప్పుడు పాతబస్తీలో తన మద్దతుదారుల ఇళ్లలోకి దూరిన టాస్క్ ఫోర్స్ పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు.
దీంతో ఇళ్లలోని మహిళలు ఫోన్ చేసి ‘అసద్.. వెంటనే ఇక్కడకు రా.. పిల్లలను పోలీసులు కొడుతున్నారు’ అంటూ అర్థించారన్నారు. హుటాహుటిన తాను ఘటనాస్థలానికి వెళ్లగానే.. ‘నిన్ను అరెస్ట్ చేయబోతున్నాం’ అని అప్పటి డీఎస్పీ శ్రీనివాసులు చెప్పారన్నారు. సరే అరెస్ట్ చేయండి అని తాను చెప్పగానే వాళ్లంతా తనను చుట్టుముట్టి ఫైబర్ కర్రలతో విచక్షణారహితంగా కొట్టారని గుర్తుచేసుకున్నారు. పోలీసులు వాడే ఫైబర్ కర్రలు చాలా గట్టిగా ఉంటాయనీ, దెబ్బకూడా గట్టిగా తగులుతుందన్నారు.
ఈ దాడిలో తన తలపై 19 కుట్లు పడ్డాయనీ, నడుము కిందిభాగం పనిచేయడం మానేసిందని తెలిపారు. దీంతో అనుచరులు తనను ఆసుపత్రికి తీసుకెళ్లారన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి చేరుకున్న అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం విజయభాస్కర్ రెడ్డి తన తండ్రితో ‘మీ వాడిని పోలీసులు ఎందుకు కొట్టారో తెలుసా? అని ప్రశ్నించగా, తన తండ్రి సలాహుద్దీన్ ఒవైసీ తెలియదని జవాబిచ్చారని వెల్లడించారు.
అసద్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా గుంటూరులో ప్రచారం నిర్వహించడంతోనే చంద్రబాబు పోలీసులతో కొట్టించాడని విజయభాస్కర్ రెడ్డి చెప్పారన్నారు. అనాడు తాను కాంగ్రెస్ కోసం దెబ్బలు తింటే అదే కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న రాహుల్ ఇప్పుడు చంద్రబాబుతో చేతులు కలిపారని దుయ్యబట్టారు.