polling: పోలింగ్ రోజునే 7 సినిమాల విడుదల.. శుక్రవారం నుంచి వరుస సెలవులు.. తలలు పట్టుకుంటున్న అధికారులు
- శుక్రవారం నుంచి వరుస సెలవులు
- అదే రోజున సినిమాల విడుదల
- పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం
తెలంగాణ శాసనసభకు ఈ నెల 7న పోలింగ్ జరగనుంది. శుక్రవారం కావడంతో అదే రోజు ఏకంగా ఏడు తెలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అంతేకాదు, ఆ రోజు నుంచి వరుసగా మూడు రోజులు అంటే.. శుక్రవారం పోలింగ్ సందర్భంగా సెలవు, ఆ తర్వాతి రోజు రెండో శనివారం, తర్వాత ఆదివారం.. దీంతో రాజకీయ నేతలలో గుబులు పట్టుకుంది. సెలవులు వచ్చాయి కాబట్టి ఓటర్లు సొంతూరి బాట పడితే పరిస్థితి ఏంటన్న ప్రశ్న వారిని వేధిస్తోంది. మరోవైపు అదే రోజు ఏకంగా ఏడు సినిమాలు విడుదల కానుండడంతో సినీ ప్రేమికుల మనసు అటు మళ్లినా ఓటింగ్ శాతం తగ్గిపోతుందని, అది విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు.
భైరవగీత, కవచం, నెక్ట్స్ ఏంటి, సువర్ణ సుందరి, శుభలేఖలు, ఇదంజగత్, సుబ్రహ్మణ్యపురం వంటి సినిమాలు ఏడో తేదీన విడుదల కాబోతున్నాయి. దీనికితోడు ఆ తర్వాత వరుసగా సెలవులు రావడం పోలింగ్‌పై ప్రభావం చూపుతుందని పరిశీలకులు సైతం చెబుతున్నారు. సెలవులను సద్వినియోగం చేసుకునే వేతన జీవుల్లో చాలామంది ఆ రోజు సొంతూర్లకు క్యూ కట్టే అవకాశం ఉందంటున్నారు. దాదాపు 4 లక్షల మంది వరకు సెలవులను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని, అదే జరిగితే పోలింగ్ శాతం భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో 53 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. అయితే, ఇలా అనుకోని సెలవులు, సినిమాల విడుదల వారి ప్రయత్నాన్ని అడ్డుకునేలా కనిపిస్తున్నాయి. అధికారులు మాత్రం భయపడేంతగా ఏమీ ఉండదని, సెలవులు, సినిమాల ప్రభావం పోలింగ్‌పై ఉండదని చెబుతున్నారు.