George Bush: బుష్‌కు దక్కనున్న అరుదైన గౌరవం.. గతంలో ఆయన నడిపిన రైలులోనే అంతిమ యాత్ర
- గురువారం జరగనున్న అంత్యక్రియలు
- 70 మైళ్ల పాటు రైలు ప్రయాణం
- మిలటరీ సారధ్యంలో అంతిమ యాత్ర
గతవారం కన్నుమూసిన అమెరికా 41వ అధ్యక్షుడు జార్జ్ బుష్(94)కు అరుదైన గౌరవం దక్కనుంది. గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బుష్ 13 ఏళ్ల క్రితం నడిపిన రైలులోనే ఆయన అంతిమ యాత్ర సాగనుంది. మొత్తం 70 మైళ్ల దూరం ఈ రైలులో అంతిమ యాత్ర సాగుతుంది. 2005లో బుష్ నడిపేందుకు వీలుగా ఈ రైలును తీర్చిదిద్దారు.
ఇప్పుడదే రైలులో బుష్ పార్థివదేహాన్ని టెక్సాస్ ఏఅండ్ఎం యూనివర్సిటీలోని ప్రెసిడెన్షియల్ లైబ్రరీ వద్దకు తరలిస్తారు. అక్కడాయన కుమార్తె, భార్య సమాధుల చెంతనే ఆయన పార్థివదేహాన్ని ఖననం చేస్తారు. మిలటరీ సారధ్యంలో జరగనున్న అంతిమ యాత్రలో ఎయిర్‌ఫోర్స్ ఫ్లాగ్‌షిప్ జెట్, ఎయిర్‌ఫోర్స్ వన్‌లు కూడా పాల్గొననున్నాయి. ఆదివారమే హూస్టన్‌కు చేరుకున్న ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం బుష్ పార్థివదేహాన్ని మేరీలాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు తరలించనుంది.