Narendra Modi: డిసెంబర్ 7 తర్వాత వారసత్వ, కుటుంబ పార్టీలన్ని కనుమరుగైపోతాయి: ప్రధాని మోదీ

  • తెలంగాణలో అభివృద్ధి జరగలేదు
  • ఐదేళ్లు వృథా అయిపోయాయి
  • మరో ఐదేళ్లు వృథా కాకూడదంటే మమ్మల్ని గెలిపించండి

డిసెంబర్ 7 తర్వాత వారసత్వ, కుటుంబ పార్టీలన్నీ కనుమరుగైపోతాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న బీజేపీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కూడా ఒక కుటుంబం చేతిలోనే చిక్కుకుందని విమర్శించారు. ఒక కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేస్తోందని ఆరోపించారు.

టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, కుటుంబ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీలలో కేసీఆర్ శిక్షణ తీసుకున్నారని, కేసీఆర్ కు సోనియా, చంద్రబాబులు గురువులని విమర్శించారు. కాంగ్రెస్ కు టీఆర్ఎస్ ‘బీ’ టీమ్ అని, టీఆర్ఎస్ దొడ్డిదారిన ఆ పార్టీతో కలుస్తోందని ఆరోపించారు.

కుటుంబ పాలనపై ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని, తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని అన్నారు. బీజేపీ పాలనలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశామని, ఎక్కడా ఇబ్బందులు లేవని, చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని అన్నారు. తెలంగాణలో మాత్రం అభివృద్ధి జరగలేదని, ఐదేళ్లు వృథా అయిపోయాయని, మరో ఐదేళ్లు వృథా కాకూడదంటే తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

  • Loading...

More Telugu News