Telangana: ఏకంగా ఐక్యరాజ్యసమితే మా పథకాలను ప్రశంసించింది!: సీఎం కేసీఆర్

  • సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం
  • 4 ఏళ్లలోనే రెండంకెల వృద్ధిని సాధించాం
  • సత్తుపల్లి ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్

తెలంగాణ ఏర్పాటు అయితే రాష్ట్రం చీకటిమయంగా మారుతుందని అప్పటి సమైక్య రాష్ట్ర సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బెదిరించారని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల కరెంట్ లేదనీ, కానీ తెలంగాణలో మాత్రం నిరంతరాయంగా విద్యుత్ ను అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఈరోజు జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలకు తెలంగాణలో శ్రీకారం చుట్టామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ చొరవను, సంక్షేమ పథకాలను స్వయంగా ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందని గుర్తుచేశారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, అవ్వాతాతలకు పెన్షన్లు, కేసీఆర్ కిట్లు సహా పలు విప్లవాత్మక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులను మెరుగుపరిచామనీ.. కాన్పులో అమ్మాయి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు అందిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక ఉద్యమం సమయంలో సత్తుపల్లి ప్రాంతానికి తాను ఎక్కువసార్లు రాలేకపోయానని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా పనిచేయడంతో రెండు అంకెల అభివృద్ధి సాధ్యమయిందన్నారు.

ఖమ్మం జిల్లా పచ్చగా మారాలంటే సీతారామా ప్రాజెక్టు రావాలన్నారు. దీనివల్ల ఖమ్మం జిల్లాలో ఏడాది అంతటా రెండు పంటలకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీరు కూడా అందుబాటులోకి వస్తుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన పిడమర్తి రవి ఈసారి సత్తుపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారనీ, రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. నాలుగున్నర ఏళ్ల కాలంలో తాము చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని కోరారు.

  • Loading...

More Telugu News