Andhra Pradesh: టీడీపీలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-b8e095d8a89e9e545996a963be52b9da9b96ad44.jpg)
- జగన్ నాకు రాజకీయ జీవితం ఇచ్చారు
- జీవితాంతం ఆయన వెంటే ఉంటాను
- అనకాపల్లి సమావేశంలో ముత్యాలనాయుడు
వైసీపీ నేత, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో అధికార టీడీపీలో చేరితే తనకు రూ.30 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నేతలు ఆఫర్ చేశారని ఆయన తెలిపారు. అయితే తాను జగన్ వెంటే ఉంటాననీ, పార్టీ మారబోనని వారికి స్పష్టం చేశానన్నారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన జగన్ ను మోసం చేయబోనని తేల్చిచెప్పినట్లు పేర్కొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి గాంధీనగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అనకాపల్లి పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రలో వివిధ ప్రాంతాల్లోని సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళుతున్నారని తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు ఎలా భరోసా ఇచ్చారో, జగన్ పాదయాత్ర కూడా అలాగే సాగుతోందన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఆయనను చంపేందుకు కొందరు కుట్ర చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, నేతలు మళ్ల బుల్లిబాబు, దంతులూరి శ్రీధర్‌రాజు, మూనూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.