Pawan Kalyan: ఏపీలో ముగ్గురు నాయకులే ఉన్నారు.. పెద్దవాళ్లు నన్ను నమ్మరు: పవన్ కల్యాణ్
- వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు అధికారంలోకి రావు
- 2019 నుంచి సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి
- పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాని కొందరు సీఎం కావాలనుకుంటున్నారు
రాష్ట్రంలో చంద్రబాబు, జగన్, తాను ముగ్గురు నాయకులం మాత్రమే ఉన్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. అసెంబ్లీకి రాకుండా పారిపోయిన వ్యక్తి జగన్ అని, మళ్లీ అధికారాన్ని ఇవ్వాలని అడుగుతున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు అధికారంలోకి రావని జోస్యం చెప్పారు. టీడీపీని ఓడించడం ఖాయమని చెప్పారు. పెద్దవాళ్లు ఎవరూ తనని నమ్మరని, యువకులు, ఆడపడుచులే తనకు అండగా ఉంటున్నారని పవన్ అన్నారు.
2019 నుంచి సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయని తెలిపారు. పంచాయతీ ప్రెసిడెంట్ కూడా కాని కొందరు సీఎం కావాలనుకుంటున్నారని విమర్శించారు. అమిత్ షా లాంటివారు ఎన్నికలప్పుడే రాయలసీమకు వస్తారని... కరవుసీమను ఆదుకోవడానికి రారని అన్నారు.
తాను రాయలసీమలో పుట్టకపోయినా రాగి ముద్ద, జొన్న సంకటి తిన్నానని... సీమ మహనీయులను గుండెల్లో పెట్టుకున్నానని చెప్పారు. అనంతపురం జిల్లా కమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డికి తాను ఏకలవ్య శిష్యుడినని అన్నారు. సరస్వతీ నిలయమైన రాయలసీమను ఫ్యాక్షన్ గడ్డగా సినిమాల్లో చూపిస్తున్నారని విమర్శించారు.