Hanuman: హనుమంతుడు దళితుడు కాదు.. గిరిజనుడూ కాదు.. జైనుడు: తేల్చేసిన జైన పూజారి
- హనుమంతుడు దళితుడన్న యూపీ సీఎం
- కాదు గిరిజనుడన్న ఎన్‌సీఎస్‌టీ చైర్ పర్సన్
- కానే కాదు, జైనుడన్న జైన ఆలయ పూజరి
ఎన్నికల వేడి రాజుకున్న దేశంలో ఇప్పుడు కులమతాల చర్చ జోరుగా సాగుతోంది. ఇన్నాళ్లూ మనుషులకే పరిమితమైన ఈ జాడ్యాన్ని ఇప్పుడు దేవుళ్లకూ అంటిస్తున్నారు. హనుమంతుడు దళితుడని ఒకరంటే కాదు, గిరిజనుడని మరో వర్గం వాదించుకుంటోంది. తాజాగా ఇప్పుడు మరో వాదనతో ముందుకొచ్చారు మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఓ ఆలయ పూజారి.
భోపాల్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమస్‌గఢ్‌లోని జైన ఆలయ పూజారి ఆచార్య నిర్భయ్ సాగర్ మహరాజ్ మాట్లాడుతూ.. హనుమంతుడు దళితుడు, గిరిజనుడు కాదని, అతడు జైన మతానికి చెందిన వాడని తేల్చి చెప్పారు. జైనుల్లోని 169 మంది గొప్ప వ్యక్తుల సమ్మేళనమే హనుమంతుడని స్పష్టం చేశారు.
‘‘జైనమతంలో 24 కామదేవులు ఉన్నారు. అందులో హనుమంతుడు ఒకడు. హనుమన్ క్షత్రియుడు (యుద్ధవీరుడు)’’ అని ఆయన వివరించారు. జైన గ్రంథాల్లో ఈ విషయం స్పష్టంగా రాసి ఉందన్నారు. ఇతర జైనుల్లానే హనుమంతుడికి కూడా కులం లేదని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల రాజస్థాన్‌లోని ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ, హనుమంతుడు దళితుడని పేర్కొన్నారు. యోగి వ్యాఖ్యలతో లక్నోలోని దళిత సంఘాలు తెరపైకి వచ్చాయి. హనుమంతుడి ఆలయాల నిర్వహణ బాధ్యత తమకు అప్పగించాలని డిమాండ్ చేశాయి. హనుమంతుడు తమ దేవుడు కాబట్టి ఆలయాల్లోకి కేవలం దళితులను మాత్రమే అనుమతించాలని డిమాండ్ చేశారు.
యోగి వ్యాఖ్యల తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎన్‌సీఎస్‌టీ) చైర్ పర్సన్ నంద్ కుమార్ పాయి మాట్లాడుతూ యోగి దళితుడు కాదని గిరిజనుడని పేర్కొన్నారు. అతడు ఏళ్ల పాటు అడవుల్లోనే ఉన్నాడని, కాబట్టి అతడు తప్పకుండా గిరిజనుడేనని స్పష్టం చేశారు. ఇప్పుడేమో జైనుడంటూ జైన పూజారి చెప్పడం విశేషం.