Telangana: కేసీఆర్ కు అప్పగించేందుకు హైదరాబాద్ ను అభివృద్ధి చేయలేదు... తాడోపేడో తేల్చుకునేదాకా వదిలేది లేదు: చంద్రబాబు
- తెలుగుజాతి కలిస్తే కేసీఆర్ అడ్రస్ గల్లంతు
- గతాన్ని మరచిపోయిన కేసీఆర్ ఆటలు సాగనివ్వబోను
- మోదీకి మద్దతు పలుకుతున్న కేసీఆర్ ను సాగనంపాలి
తెలుగు జాతి కలిస్తే, తన అడ్రస్ గల్లంతవుతుందని కేసీఆర్ భయంతో వణికిపోతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. గత రాత్రి, హైదరాబాద్ లోని ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ప్రజాకూటమి అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో నిర్వహించిన ఆయన, కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, వారి కుటుంబ సభ్యుల కోసం తాను హైదరాబాద్ ను అభివృద్ధి చేయలేదని చెప్పిన చెప్పారు.
గతాన్ని మరచిపోయిన కేసీఆర్ ఆటలను ఇక సాగనివ్వబోనని హెచ్చరించారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడబోనని, తాడోపేడో తేల్చుకునేదాకా వదిలేది లేదని అన్నారు. మెట్రో రైలు గరిష్ఠ టికెట్ ధరను తాను రూ. 16గా నిర్ణయిస్తే, ఇప్పుడు దాన్ని రూ. 60కి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని, కావాలనే మెట్రోను ఆయన ఆలస్యం చేశారని చంద్రబాబు ఆరోపించారు.
టీఆర్ఎస్ ఎన్ని అక్రమాలు చేసినా పత్రికల్లో కూడా రాని పరిస్థితి నెలకొనివుందని, పెద్ద నోట్ల రద్దుతో నరేంద్ర మోదీ ప్రజలను ఇబ్బందుల్లో పడేస్తే, ఆయనకు కేసీఆర్ మద్దతుగా నిలిచారని అన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను సాగనంపే అవకాశం ప్రజలకు లభించిందని, దాన్ని వినియోగించుకోవాలని ప్రజలను కోరారు.