Chandrababu: ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినోడు బుగ్గలు గిల్లుతున్నాడు: జగన్‌పై పవన్ సెటైర్
- పదవులు ఆశించకుండా చంద్రబాబుకు మద్దతిచ్చా
- ‘ఓటుకు నోటు’కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చారు
- జనసేన అధికారంలోకి వస్తే ‘రాయల’పాలన
అనంతపురంలో ఆదివారం నిర్వహించిన ‘రాయలసీమ వెనుకబాటు తనంపై నిరసన కవాతు’లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత పాదయాత్ర పేరుతో అసెంబ్లీకి వెళ్లకుండా తల నిమురుతూ, బుగ్గలు గిల్లుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబు నాయుడు పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను మధ్యలోనే వదిలేసి వచ్చేశారని, మళ్లీ ఇప్పుడు అక్కడికే వెళ్లి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఎటువంటి పదవులు ఆశించకుండా చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత జగన్ ఇద్దరూ రాయలసీమ కరవును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వస్తారని, కానీ రాయలసీమలో కరవును చూసేందుకు మాత్రం రారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధికారంలోకి వస్తే రాయలనాటి పాలన అందిస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఉపాధి కోసం గల్ఫ్‌కు వలస వెళ్తున్న వారి కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని పవన్ పేర్కొన్నారు.