tjs: టీజేఎస్ కి రాజీనామా చేసిన రచనారెడ్డి.. కోదండరామ్ పై సంచలన వ్యాఖ్యలు
- ఉపాధ్యక్షురాలి పదవికి కూడా
- ప్రజాకూటమిలో సామాజిక న్యాయం జరగలేదు
- కాంగ్రెస్ తో కోదండరామ్ అంతర్గత ఒప్పందాలు
తెలంగాణ జన సమితి (టీజేఎస్)కి, ఉపాధ్యక్షురాలి పదవికి రచనారెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజాకూటమిలో సామాజిక న్యాయం జరగలేదని, ఈ కూటమిలో ప్యారాచూట్ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. కూటమిలో అమాయకులను బలిపశువులను చేశారని, కాంగ్రెస్ పార్టీని, టీజేఎస్ అధినేత కోదండరామ్ ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీతో కోదండరామ్ అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కు ప్రజాకూటమి ప్రత్యామ్నాయం కాదని, ఈ కూటమిలో పొలిటికల్ బ్రోకర్స్ ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చల పేరిట హోటల్స్ లో సమావేశాలు ఏర్పాటు చేసి టైంపాస్ చేశారని, పైసలు వసూలు చేసి ప్రజాకూటమి ఏర్పాటు చేశారని ఆరోపించారు. అనారోగ్యకరమైన వాతావరణం ఈ కూటమిలో ఉందని విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు జ్ఞానం ఉందని, టీడీపీని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పిన రచనారెడ్డి, మైనార్టీలకు టీజేఎస్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని అన్నారు. కూరగాయలు అమ్ముకున్నట్టే సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వాళ్లతో కలిసిన కోదండరామ్ ఓటమిపాలు కానున్నారని జోస్యం చెప్పారు. ఎల్లారెడ్డిలో పోటీ చేయాలని మొదటినుంచి తాను అనుకోలేదని స్పష్టం చేశారు.