yadava hakkula samithi: టీఆర్‌ఎస్ కు జై కొట్టిన యాదవ హక్కుల పోరాట సమితి!
- కేసీఆర్ తమ వర్గానికి అత్యధిక సీట్లిచ్చి గౌరవించారని ప్రకటన
- యాభై శాతం ఉన్న యాదవులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని ఆరోపణ
- యాదవులంతా కారు గుర్తుకు ఓటేయాలని పిలుపు
జనాభాలో యాభై శాతం ఉన్న తమ పట్ల కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే, సముచిత స్థానం ఇచ్చి టీఆర్‌ఎస్ గౌరవించిందని, అందువల్ల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని యాదవ హక్కుల పోరాట సమితి ప్రకటించింది.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాముయాదవ్, ఉపాధ్యక్షుడు చక్రధర్ యాదవ్ లు మాట్లాడుతూ ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి చెందిన ఆరుగురికి టికెట్లు ఇచ్చి కేసీఆర్ యాదవుల ఆత్మగౌరవాన్ని పెంపొందించారన్నారు. అంతకుముందు కొమురవెల్లి ఆలయ చైర్మన్‌తోపాటు ఎనిమిది మంది సభ్యులుగా యాదవులనే నియమించారని గుర్తు చేశారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ ఎన్నికల్లో ఒకే ఒక్కడికి టికెట్ కేటాయించడమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. అందువల్ల యాదవులంతా ఈ విషయాన్ని గుర్తించి టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు.