Kacheguda: సమూలంగా మారిపోయిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' రూపురేఖలు
- కాచిగూడ నుంచి చిత్తూరు మధ్య నడిచే రైలు
- అందంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దిన ద.మ.రైల్వే
- ఎయిర్ క్లీనర్లు, బయో టాయిలెట్ల ఏర్పాటు
- మైక్ సిస్టమ్ కూడా
కాచిగూడ నుంచి కర్నూలు, కడప తిరుపతి మీదుగా చిత్తూరు వరకూ నిత్యమూ రాకపోకలు సాగించే వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు సమూలంగా మారిపోయింది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు దగ్గర చేయాలన్న ఉద్దేశంతో, కేంద్రం ప్రారంభించిన స్కీమ్ లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ఈ రైలు రూపు రేఖలను మార్చింది. ఏసీ బోగీలతో పాటు అన్ని బోగీలనూ మరింత అందంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు.
బయోటాయిలెట్లను ఏర్పాటు చేసిన అధికారులు, వాటిని ఎలా వాడుకోవాలన్న అంశంపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు స్టిక్కర్లను అంటించడమే కాకుండా, పీఏ సిస్టమ్ ను వాడుతూ మైకులో అనౌన్స్ మెంట్ చేస్తున్నారు. రైలు ఏ స్టేషన్ కు ఎప్పుడు, ఎన్ని గంటలకు చేరుతుందో వివరించడంతో పాటు, గాలిని శుభ్రపరిచే పరికరాలు, బెర్తుల వద్ద నైలాన్ వాటర్ బాటిల్ స్టాండ్లు అమర్చారు. స్టీలు చెత్త బుట్టలను, వెస్ట్రన్ టాయిలెట్లలో కొత్త నీటి పంపులను, టిష్యూ పేపర్లను అందుబాటులోకి తెచ్చారు. ఏసీ కోచ్ లలో కంప్లయింట్ బాక్స్ లను అమర్చారు. దీంతో రైలు రూపురేఖలే మారిపోయాయి.