KCR: చంద్రబాబును పట్టించుకునే వారెవరూ ఇక్కడ లేరు: కేసీఆర్
- ప్రచారంలో టీఆర్ఎస్ ముందంజ
- పోటీ పడలేకపోతున్న కూటమి
- వెలవెలబోతున్న చంద్రబాబు సభలు
- సమీక్షలో కేసీఆర్
తెలంగాణకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పాటు పోటీగా ప్రచారం చేయడంలో ప్రజాకూటమి విఫలమైందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నిన్న తన ప్రచారానికి విరామం ప్రకటించి, ప్రచార సరళిని సమీక్షించిన ఆయన, జాతీయ స్థాయి నేతలను ఢిల్లీ నుంచి, కాంగ్రెస్ నేతలను పక్క రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చినా, ప్రజా కూటమి ప్రచారంలో పోటీ పడలేకపోయిందని ఆయన అన్నట్టు తెలిసింది. సోనియా, రాహుల్ బహిరంగ సభలకు జనం నుంచి వచ్చిన స్పందన చాలా తక్కువగా ఉందని కేసీఆర్ పేర్కొన్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఎన్నికల్లో ప్రజా కూటమి చిత్తుగా ఓడిపోనుందని చెప్పిన ఆయన, చంద్రబాబు సభలు వెలవెలబోతున్నాయని, ఆయన్ను పట్టించుకునే వారెవరూ ఇక్కడ లేరని అన్నారు. నరేంద్ర మోదీ మొదలు ఎంతో మంది కేంద్ర మంత్రులు వచ్చినా, బీజేపీ పుంజుకోలేదని కూడా ఆయన అన్నట్టు సమాచారం. తెలంగాణ ప్రజలంతా తెరాసకే బ్రహ్మరథం పడుతున్నారని చెప్పిన కేసీఆర్, మరో నాలుగు రోజులు ఇదే తరహా ఉత్సాహంతో ప్రతి నేత, కార్యకర్త పని చేయాలని సూచించారు.