Telangana: మళ్లీ రాహుల్, చంద్రబాబు కలసి ప్రచారం!

  • ఇప్పటికే ఓ మారు రాహుల్, చంద్రబాబు ప్రచారం
  • హోరాహోరీ పోటీ అంటున్న సర్వేలు 
  • పరిస్థితిని అనుకూలం చేసుకునేందుకు నేతల షెడ్యూల్

తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా ఉందన్న వార్తలు, పలు నియోజక వర్గాలలో స్వతంత్రులు నెగ్గే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మరోసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రానున్నారు. రేపు తెలంగాణకు రాహుల్ గాంధీ రానుండగా, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా తనవంతు ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు, ఆయనతో కలసి రోడ్ షో నిర్వహించనున్నారు.

తెలంగాణ ఎన్నికల యుద్ధం క్లైమాక్స్ కు చేరిన వేళ, రాహుల్ గాంధీ, సోమవారం నాడు గద్వాల, తాండూరుల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రేపు సాయంత్రం హైదరాబాద్ లో చంద్రబాబు, రాహుల్ గాంధీలు కలసి రోడ్ షోను నిర్వహించడంతో పాటు ఒకే వేదికను పంచుకోనున్నారు.

ఇక నేడు రాష్ట్రానికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉదయం నారాయణ పేటలో ప్రచారం చేయనున్నారు. ఆపై మధ్యాహ్నం 1.35కు కల్వకుర్తిలో, 3.20కి కామారెడ్డిలో జరిగే సభల్లో పాల్గొని, సాయంత్రం 5 గంటల నుంచి మల్కాజిగిరిలో రోడ్ షోలో పాల్గొంటారు.

ఇదే సమయంలో నేడు తెలంగాణలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటిస్తున్నారు. ఆయన మధ్యాహ్నం 2.30 గంటలకు తాండూరులో ప్రచారం చేస్తారు. సాయంత్రం 4 గంటలకు సంగారెడ్డి, ఆపై 5 గంటలకు మేడ్చల్, 6 గంటలకు గోషామహల్ లో రోడ్ షోలను నిర్వహిస్తారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉదయం 11 గంటలకు ఉప్పల్ లో, 12.45కు కొల్లాపూర్, మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలో, సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు.

రేపు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రానుండగా, నాంపల్లిలోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఇదిలావుండగా, నేడు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు గులాబీ బాస్ కేసీఆర్ కూడా పాల్గొంటారు. ఈ సభకు దాదాపు 4 లక్షల మందిని సమీకరించాలని టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News