Earth Quake: హిమాలయ ప్రాంతంలో భవిష్యతులో భారీ భూకంపం.. శాస్త్రవేత్తల హెచ్చరిక!
- తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.5 ఉంటుంది
- శాటిలైట్ చిత్రాల ఆధారంగా వెల్లడి
- ఎప్పుడైనా విపత్తు సంభవించే అవకాశం
మధ్య హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.5 ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూగర్భ డేటా, భారతీయ భూ వైజ్ఞానిక పరిశోధన సంస్థ, గూగుల్ ఎర్త్‌తో పాటు ఇస్రో కార్టోసాట్-1 శాటిలైట్ తీసిన చిత్రాల ఆధారంగా తాము ఈ విషయాన్ని తెలుపుతున్నట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
బెంగళూరులోని జవహర్ లాల్ నెహ్రూ ఆధునిక శాస్త్రీయ పరిశోధన సంస్థకు చెందిన భూకంప శాస్త్రవేత్త సీపీ రాజేంద్రన్ ఈ పరిశోధన వివరాలు తెలిపారు. ఉత్తరాఖండ్ నుంచి పశ్చిమ నేపాల్ మధ్య భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ విపత్తు సంభవించే అవకాశముందని తాజా పరిశోధనల ఆధారంగా వెల్లడించారు. భూ పొరల్లో కదలికలు, ఘర్షణల ఫలితంగా తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో ఈ విపత్తు సంభవించే అవకాశముందని తెలిపారు.