Rahul Gandhi: అప్పట్లో రాహుల్ ను చెప్పులు, టమోటాలతో కొట్టించారు.. ఇప్పుడేమో అతని చెప్పులనే నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారు!: చంద్రబాబుపై రోజా సెటైర్లు

  • ఏపీ సమస్యలను చంద్రబాబు గాలికి వదిలేశారు
  • ఆయన ఎంతకైనా దిగజారుతారు
  • చంద్రబాబు అవినీతిపరుడని కాంగ్రెస్సే చెప్పింది

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుంటూరు పర్యటనకు వస్తే చెప్పులు, టమోటాలతో ఏపీ సీఎం చంద్రబాబు కొట్టించారని, అదే చంద్రబాబు ఈ రోజు తెలంగాణలో రాహుల్ గాంధీ చెప్పులు నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారని వైసీసీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఏపీ సమస్యల సుడిగుండంలో చిక్కుకుని అల్లాడుతుంటే చంద్రబాబు తెలంగాణలో ప్రచారం పేరుతో తిరుగుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు విలువలు లేవనీ, రాజకీయ అవసరాల కోసం ఆయన ఎంతకైనా దిగజారుతారని ఆరోపించారు. ఏలూరులో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు.

ఏపీకి ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, విభజన హామీల అమలునే సాధించుకోలేకపోయిన చంద్రబాబు దేశాన్ని కాపాడుతానని చెప్పడం హాస్యాస్పదమని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు దెబ్బకు డ్వాక్రా మహిళలు రుణాలు తిరిగిచెల్లించక బ్లాక్ లిస్టులోకి జారిపోయారన్నారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను పచ్చమీడియా పక్కదారి పట్టిస్తోందని దుయ్యబట్టారు. దేశంలోనే నంబర్‌ వన్‌ అవినీతి పరుడు చంద్రబాబు నాయుడని ఈ ఏడాది జూన్‌ 8న కాంగ్రెస్ పార్టీ చార్జిషీటును విడుదల చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఆంధ్రాను మోసం చేసిన బాబు ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారని ఆరోపించారు.  

Rahul Gandhi
Congress
Chandrababu
Andhra Pradesh
Telangana
roja
YSRCP
eluru
  • Loading...

More Telugu News