rajani: తమిళనాట 'సర్కార్' రికార్డుకు దూరంగానే వుండిపోయిన '2.ఓ'
- చెన్నైలో '2.ఓ' సినిమాదే పై చేయి
- 'సర్కార్' వసూళ్లకు అదే కారణం
- 3డీ ఫార్మాట్ లోనే చూడాలని వెయిటింగ్
భారీ బడ్జెట్ తో రూపొందిన '2.ఓ' భారీ అంచనాల నడుమ నవంబర్ 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా, రెండో రోజున కూడా నిలకడగా వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు కంటే రెండో రోజున హిందీ వెర్షన్ వసూళ్లు పుంజుకున్నట్టుగా తెలుస్తోంది.
చెన్నై నగరానికి సంబంధించినంత వరకూ తొలి రోజు వసూళ్ల విషయంలో 'సర్కార్'ను వెనక్కి నెట్టిన ఈ సినిమా, తమిళనాడు మొత్తంగా చూస్తే 'సర్కార్' రికార్డుకి దూరంగా వుండిపోయిందని చెబుతున్నారు. తమిళనాడులో 'సర్కార్' రెండు రోజుల్లోనే 50 కోట్లను రాబట్టింది. '2.ఓ' మాత్రం రెండు రోజుల్లో 30 కోట్ల లోపే వసూలు చేసింది. అయితే 'సర్కార్' సినిమాకి దీపావళి సెలవులు కలిసి వచ్చిన కారణంగానే ఆ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని అంటున్నారు. ఇక చాలా మంది 3డీ ఫార్మాట్ లోనే చూడాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తుండటం కూడా '2.ఓ' వసూళ్లపై ప్రభావం చూపుతోందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.