Andhra Pradesh: కూకట్ పల్లి ‘కాపు’ సభలో పవన్ కల్యాణ్ పేరెత్తిన కేటీఆర్.. నినాదాలతో మార్మోగిన సమావేశం!
- ఏపీ ప్రభుత్వాన్ని ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదు
- చంద్రబాబు, రాహుల్ ఫిడేల్, వీణ వాయించుకోవాల్సిందే
- పవన్ కల్యాణ్ మా పథకాలను ప్రశంసించారు
ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడూ వ్యవహరించలేదని తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించామని గుర్తుచేశారు. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాహుల్ గాంధీ వీణ, చంద్రబాబు ఫిడేల్ వాయించుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతోందని మంత్రి జోస్యం చెప్పారు. కూకట్ పల్లిలో కాపు సామాజికవర్గం ఈరోజు నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తోందని కేటీఆర్ అన్నారు. తాము అమలు చేస్తున్న 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారని గుర్తుచేశారు. సమావేశంలో పవన్ కల్యాణ్ పేరెత్తగానే జై జనసేన.. జైజై జనసేన అంటూ నినాదాలు మిన్నంటాయి. కాబోయే ఏపీ సీఎం పవన్ కల్యాణ్.. అంటూ పలువురు యువకులు సభా వేదిక దద్దరిల్లేలా నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు జనసేన జెండాలను ప్రదర్శించారు.