Uttar Pradesh: గొడవపడి పెళ్లి వాయిదా వేసిన పెద్దలు.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన యువజంట!

  • యువతి మృతి, కొనప్రాణాలతో ప్రియుడు
  • ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్ లో ఘటన
  • కేసు నమోదుచేసిన పోలీసులు

యువతీయువకుల వివాహానికి అంగీకరించిన పెద్దలు పెళ్లి ఏర్పాట్ల సందర్భంగా గొడవ పడ్డారు. దీంతో ఏకంగా వివాహాన్నే రద్దు చేసుకున్నారు. సదరు జంట ఎంతగా నచ్చజెప్పినా వినలేదు. చివరికి ఒకరు లేకుండా మరొకరు బతకలేమని భావించిన యువ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఢిల్లీకి చెందిన పూజ, సుబోధ్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా, పెద్దవాళ్లు అంగీకరించారు. వివాహ ఏర్పాట్లను సైతం మొదలుపెట్టారు. అయితే ఈ సందర్భంగా ఓ చిన్న విషయమై ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. ఈ వివాదం తీవ్రరూపు దాల్చడంతో ఇరు కుటుంబాలు పెళ్లిని రద్దు చేసుకున్నాయి. ఈ విషయమై సుబోధ్, పూజ పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

అయినా పెద్దలు ఈ వివాహానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఒకరినొకరు విడిచి జీవించలేమని భావించిన ఈ జంట ఘజియాబాద్ సమీపంలోని ఓ హోటల్ కు చేరుకుంది. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వీరిని ఆలస్యంగా గమనించిన హోటల్ యజమాని పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు వీళ్లిద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతూ పూజ చనిపోగా, సుబోధ్ కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ఘజియాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Uttar Pradesh
New Delhi
family
issues
parents
suicide
  • Loading...

More Telugu News