Tamilnadu: దొంగిలించిన వ్యాన్‌ను పోలీసులతోనే నెట్టించుకున్న దొంగ.. విషయం తెలిసి అవాక్కైన పోలీసులు
- పార్క్ చేసిన వాహనాన్ని దొంగిలించిన దుండగుడు
- మొరాయించడంతో పోలీసులతోనే నెట్టించుకున్న వైనం
- అనుమానంతో అదుపులోకి
దొంగిలించిన వాహనాన్ని పోలీసులతోనే నెట్టించుకున్నాడో దొంగ. అనుమానం వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకుంటే దొంగ గారి బాగోతం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని వేలూరు జిల్లా సత్తువాచేరిలో జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం.. రెహమాన్ అనే వ్యక్తి రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి ఇంటికెళ్లాడు. అది చూసిన బాలాజీ (27) అనే వ్యక్తి వ్యానును దొంగిలించి చెన్నై శివారులోని పుళల్‌కు తీసుకెళ్లాడు. ఇక, తెల్లవారిన తర్వాత వ్యాను కోసం వచ్చిన రహమాన్ కంగుతిన్నాడు. వ్యాను కనిపించకపోవడంతో లబోదిబోమన్నాడు. వ్యాను పార్క్ చేసిన ప్రాంతంలో అద్దం ముక్కలు పడి ఉండడంతో వాహనాన్ని దొంగిలించినట్టు అనుమానించాడు.
మరోవైపు దొంగిలించిన వాహనంతో బాలాజీ పుళల్ చేరుకున్నాడు. అయితే, అక్కడ వాహనం మొరాయించడంతో ఏం చేయాలో పాలుపోలేదు. చుట్టూ చూస్తే పోలీసులు కనిపించారు. వారిని పిలిచిన బాలాజీ వ్యాను కదలడం లేదని, కాస్త నెట్టాలని కోరాడు. నెట్టేందుకు సిద్ధమవుతుండగా ఓ పోలీసు వాహనం అద్దం పగిలి ఉండడాన్ని చూసి అనుమానించాడు. వాహనానికి తాళం చెవి కూడా లేకపోవడంతో అనుమానం మరింత బలపడింది.
వెంటనే బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. వ్యాను వెనకవైపు ఉన్న ఫోన్ నంబరుకు ఫోన్ చేస్తే.. వాహనం తనదేనని, దొంగతనానికి గురైందని రహమాన్ పేర్కొన్నాడు. దీంతో బాలాజీని స్టేషన్‌కు తరలించి విచారించారు. తాను ఇప్పటి వరకు పది వాహనాలను దొంగిలించినట్టు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడిపై ఓ హత్యాయత్నం కేసు కూడా నమోదైనట్టు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.