KCR: కేసీఆర్ కారులో నలుగురికే చోటు: ఖుష్బూ
- ఆ కారులో వారి కుటుంబమే కూర్చుంటుంది
- కవిత కోసం మహిళలను ఎదగనీయడం లేదు
- సచివాలయానికి వెళ్లని ఏకైక సీఎం
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖుష్బూ మరోమారు విమర్శలతో చెలరేగారు. మహబూబ్‌నగర్‌లో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ‘కారు’లో నలుగురికే చోటుందని, అందులో ఆయన కుటుంబ సభ్యులే కూర్చుంటారని విమర్శించారు. కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలనలో రూ. 2.20 లక్షల కోట్లు అప్పు చేశారని, అయినా రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు.
మరి ఎవరి సంతోషం కోసం ఈ డబ్బులు ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె కవితకు ప్రాధాన్యం తగ్గిపోతుందన్న కారణంతో పార్టీలో మహిళలను ఎదగనీయడం లేదని ఆరోపించారు. మహిళా కమిషన్, మహిళా సంక్షేమాన్ని కూడా కూడా కేసీఆర్ విస్మరించింది అందుకేనన్నారు. రెండున్నరేళ్లుగా సచివాలయంలో కాలుపెట్టకుండా పాలన సాగించిన ఏకైక ముఖ్యమంతి కేసీఆరేనని ఖుష్బూ ఎద్దేవా చేశారు.