kcr: ఈఎస్ఐ కుంభకోణంలో తన పేరు లేకుండా కేసీఆర్ చేసుకున్నారు: ఉత్తమ్ ఆరోపణలు
- కేసీఆర్ నాడు కేంద్ర మంత్రిగా అక్రమాలకు పాల్పడ్డారు
- ఈఎస్ఐ కుంభకోణంలో ఏ-1గా ఆయన పేరుంది
- ఢిల్లీ చుట్టూ తిరిగి తన పేరు లేకుండా చేసుకున్నారు
కేసీఆర్ నాడు కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలు వెలుగులోకి రాకుండా చూసుకున్నారని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ప్రజాకూటమి నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. తొలుత, ఉత్తమ్ మాట్లాడుతూ, నాడు ఈఎస్ఐలో జరుగుతున్న అక్రమాలను సీబీఐ బయటపెడుతున్న సందర్భంలోనే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు.
యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే ఛార్జిషీట్ లో కేసీఆర్ పేరు కూడా ఉందని, ఈ కుంభకోణంలో ఏ-1గా ఆయన పేరు ఉందని అన్నారు. అయితే, కంటి శస్త్ర చికిత్స పేరిట కేసీఆర్ ఢిల్లీ చుట్టూ తిరిగి ఆ ఛార్జిషీట్ లో తన పేరు లేకుండా తీసేయించుకున్నారని ఆరోపించారు. నరేంద్ర మోదీ, కేసీఆర్ మధ్య సంబంధాలు క్రమంగా బయటపడుతున్నాయని, రాష్ట్ర హామీలు నెరవేర్చని మోదీని కేసీఆర్ ప్రశ్నించకపోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.