Andhra Pradesh: సుజనా చౌదరికి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఈడీ విచారణకు హాజరుకావాలని ఆదేశం!
- ఈడీ వేధిస్తోందని ఆరోపించిన సుజనా
- కేంద్రం రాజకీయ కక్ష సాధిస్తోందని మండిపాటు
- కీలక ఉత్తర్వులు జారీచేసిన ఢిల్లీ హైకోర్టు
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరికి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులను రూ.6,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఇచ్చిన సమన్లపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు సోమవారం విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. సుజనా చౌదరి నివాసాలు, కార్యాలయాలపై ఇటీవల ఐటీ శాఖ, ఈడీ అధికారులు పలుమార్లు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు, హార్డ్ డ్రైవ్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వాటిని విశ్లేషించిన ఈడీ అధికారులు సోమవారం విచారణకు హాజరుకావాలంటూ సుజనాకు తాజాగా సమన్లు జారీచేశారు. దీంతో సుజనా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బీజేపీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అందులో ఆరోపించారు. ఇందులో భాగంగా ఈడీ, ఐటీ దాడులతో వేధిస్తున్నారని వాపోయారు. మరోవైపు ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం సుజనాపై ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోరాదని ఈడీ అధికారులను ఆదేశించింది.