Telangana: సొంత స్థానాల బాటలో కాంగ్రెస్ బడా నేతలు... కారణమిదే!
- ముందు తాము గెలవాలన్న ఆలోచనలో నేతలు
- ప్రధాన నేతల నియోజకవర్గాలపై టీఆర్ఎస్ దృష్టి
- వారిని ఒక్క ప్రాంతానికే పరిమితం చేసే వ్యూహం
తెలంగాణకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముందు తమ సొంత నియోజకవర్గాల్లో గెలవాలన్న భావనలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన నేతలంతా తాము పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మకాం వేశారు. ముందు ఇంటగెలిస్తే, తరువాత సీఎం పదవికి, కీలకమైన మంత్రి పదవులకు పోటీ పడవచ్చన్న ఆలోచనలో ఉన్న వీరంతా, మిగతా నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్లే ముందు తాము పోటీ పడుతున్న చోట ప్రత్యేక దృష్టిని సారించారు.
సీఎం రేసులో ముందున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, గీతారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ తదితరులు ఇప్పుడు సొంత కోటలపై దృష్టిని సారించారు. వీరిలో రేవంత్, ఉత్తమ్ మినహా మిగతావారెవరూ బయటి ప్రాంతాల్లో కనిపించడం లేదు. వీరిద్దరూ కూడా రాబోయే నాలుగైదు రోజులూ సొంత ప్రాంతాల్లోనే ప్రచార షెడ్యూల్ ను ఏర్పాటు చేసుకున్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీలోని ప్రధాన నేతలు పోటీ పడుతున్న నియోజకవర్గాలపై టీఆర్ఎస్ సైతం ప్రత్యేక దృష్టిని కేటాయించింది. ప్రధాన నేతలు పోటీ చేస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లలో మరింత ప్రచారం చేయడం ద్వారా వారిని అక్కడి నియోజకవర్గాలకే పరిమితం చేయాలన్నది గులాబీ బాస్ ప్లాన్ గా తెలుస్తోంది.