Karnataka: వితంతువులే టార్గెట్... నమ్మించి నయవంచన చేసే మోసగాడికి అరదండాలు!
- ఒంటరి మహిళ కావాలంటూ ప్రకటనలు
- పెళ్లి చేసుకుంటానని చెబుతూ కోరిక తీర్చుకునే రామకృష్ణ
- టీచర్ ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు
భర్త చనిపోయో లేదా విడాకులు తీసుకునో ఒంటరిగా ఉంటున్న మహిళలను టార్గెట్ చేసుకుని, వారిని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని చెబుతూ, లైంగిక వాంఛలు తీర్చుకుని నయవంచన చేస్తున్న మోసగాడిని కర్ణాటక పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, మాండ్యా జిల్లాకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి, తాను ప్రభుత్వ ఉద్యోగినని, పెళ్లి చేసుకునేందుకు వితంతువు లేదా విడాకులు పొందిన మహిళ కావాలంటూ పత్రికల్లో ప్రకటనలు ఇస్తాడు. ఆపై తనను సంప్రదించిన వారి వివరాలు తీసుకుని, వారిని కలిసి మోసపు మాటలతో వలేస్తాడు. కోరిక తీర్చుకుని, ఆపై డబ్బు నగలతో చిత్తగిస్తాడు.
శివమొగ్గ, మాండ్యా, మైసూరు, చిక్ బళ్లాపుర, బాగల్ కోట్, చామరాజనగర, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఎంతో మంది వితంతువులను మోసం చేశాడు. ఈయనపై పలు ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. చిక్ మగళూరుకు చెందిన ఓ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలిపై వలేసిన రామకృష్ణ, ఆమెతో మాట్లాడే నిమిత్తం వెళ్లి, నగలు చోరీ చేయడంతో ఆమె ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు రామకృష్ణ ఊరు దాటకముందే పట్టుకున్నారు. ఆపై విచారిస్తే, రామకృష్ణ బాగోతాలన్నీ బయటకు వచ్చాయి. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 420 ప్రకారం కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.