Prajakutami: నీ దమ్ము నువ్వు చూపించుకో... చంద్రబాబొచ్చాడు, రాహులొచ్చాడని ఏడవడం ఎందుకు?: బండ్ల గణేష్
- అకారణంగా ప్రజా కూటమిపై నిందలు
- చాలా అసభ్యకరంగా దూషిస్తున్నారు
- చేసిన మంచి పనులు చెప్పుకోండి
- కేసీఆర్ కు బండ్ల గణేష్ సలహా
తెలంగాణకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా కేసీఆర్, తన ప్రచార సభల్లో అకారణంగా ప్రజా కూటమి నేతలపై నిందలు వేస్తున్నారని సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కేసీఆర్ తన దమ్మును చూపించుకుని ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు.
"ప్రచారానికి వచ్చిన నేతలను ఆయన చాలా అసభ్యకరంగా దూషిస్తున్నారు. చంద్రబాబు వచ్చాడు, రాహుల్ వచ్చాడు... అంటూ ఏడవడం ఎందుకు? మీరు పక్కవాళ్ల మీద ఏడిస్తే లాభమేంది? మీ ప్రవర్తన ఏంది? మీరు చేసిన మంచి పనులు చెప్పండి. మీరు నాలుగు సంవత్సరాలా మూడు నెలలు పరిపాలించారు. దానిమీద మీరు చెప్పుకోవాలి గానీ... చంద్రబాబు వచ్చాడు, ఇంకొకరు వచ్చారు, ఎల్లయ్య వచ్చాడు, గణేష్ వచ్చాడు... ఇవన్నీ ఎందుకు మనకు?" అని అన్నారు. కేసీఆర్ తాను చేసిన పనులు చెప్పుకుని ఓట్లు అడిగితే బాగుంటుందని సలహా ఇచ్చారు. అధికారం కోల్పోతున్నానన్న బాధతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారని బండ్ల గణేష్ ఆరోపించారు.